సర్వజగత్తునకు వెలుగు
బైబిలు దేవుని వాక్యము,నిత్యమైన సత్యము. జగత్సృష్టి, దైవము పట్ల మానవుని నిరాదరణ, ఆ పాపముచే మానవుని ఆవేశీంచిన హాని ఇందలో గల అంశములు. అంతేకాక పాపమువిముక్తికై తగు ప్రణాళికను సిద్ధము చేయుటలో దేవునికి మానవునిపై గల ప్రేమనుగుఱించియు ఇది తెల్పును. లోకములో నొక రక్షకు డుద్భవించి, మానవుని పాపముల కొఱకై అతడు మరణించి,. మానవుని ముక్తికొఱకై పునరుత్థానమును చెందుట ఇది ప్రస్తావించున్నది. ఈ సందేశమును నమ్మినవారు పాప ములనుండి క్షమాభిక్షను, మనశ్శాంతిని, సర్వమానవప్రేమను, పాప నిరోధకత్వమును, సదాయుష్యముపై సజీవమైన నమ్మికను కల్గి యుందురు.
దేవుని అద్భుతమైన సృష్టి
దేవుడెల్లప్పుడును సర్వజగత్కర్తయై యున్నాడు. అతడు సర్వ వ్యాపియు, సర్వసమర్థుడును, సర్వజ్ఞుడునై యున్నాడు. అతని మహా మహిమచే సర్వమును సృజింపబడెను. దేవు డీ భూమిని సృజించి, దానిని నీటితో కప్పెను. ఆపై నతడు "ఆరిన భూమి అగపడుగాక!" అని పలుకగా ఆరిన భూమి అగపడెను. అతడు పర్వతములను,లోయలను సృజించి, వానిని గడ్డితో, అందమైన పుష్పములతో, పలురకములైన వృక్షములతో కప్పెను. అతడు పలురకముల పాటలను పాడుచున్న పక్షులను సృష్టించెను. దేవుడు చిన్నవి,పెద్దవి - అన్ని రకములైన జంతు జాలములను, సూక్ష్మక్రిమికీటకములను, భూమిపై ప్రాకెడు సరీసృపా దులను సృజించెను. అతడు సరస్సులను, సాగరములను, అందు నివసించు సమస్తప్రాణికోటిని సృజించెను. అతడు సమస్తజాతుల మాన వులు నివసించుటకు తగిన భూఖండములను సృష్టించెను. అతడు వెలు గును, వేడిని ఇచ్చుటకై సూర్యుని సృజించెను; రాత్రియందు వెలుగు నిచ్చుటకై చంద్రుని సృజించెను. ఆకాశమునంతయు మినుకుమినుకు మను అందమైన తారలతో నతడు నింపెను. చివరికి భూరజముతో నతడు మానవుని చేసి, అతని ముకురంధ్రములలో ప్రాణవాయువు నూదెను. అట్లు మానవుడు సజీవుడయ్యెను. ఆ మానవుని కతడు ఆదాము అని పేరిడెను.
ఆదామునకు సహాయము కావలెనని దేవుడు గ్రహించెను.అందుచే ఆదామును దేవుడు గాఢనిద్రలో నుంచి, ఆదాము ప్రక్కయెముకను తీసికొని, స్త్రీని (హవ్వను) సృజించెను. ఆదాము హవ్వను ప్రేమించు చుండెను; హవ్వకూడ ఆదామును ప్రేమించెను. వారు మధురమైన అన్యోన్యసాహచర్యమును కలిగియుండిరి. ఇదియే కుటుంబమునకు దేవుని యేర్పాటుగా నుండెను.
ఇట్లు దేవుడు సమస్తమును ఆరు దినములలో సృజించి, ఏడవ దినమున విశ్రాంతి తీసికొనెను. అతడు నిర్మించిన సమస్తమును చూచి అది ప్రశస్తముగా నున్నట్లు అతడు గమనించెను. అందుచే ఏడవదినము నతడు దీవించి, అది విశ్రాంతిదినముగా మానవునికి ప్రసాదించెను.
బైబిలు భ్రష్టుడైన దేవదూత - అనగా సాతానును గుఱించి తెల్పును. స్వర్గమునుండి వెలివేయబడిన అతడే సర్వదుష్టత్వమునకు మూలము. అతనివల్లనే దుఃఖము, ఆయాసము, అనారోగ్యము, మరణము ఈ ప్రపంచములో ప్రవేశించినవి.
దుఃఖకరమైన పాపముయొక్క ఆవిర్భావము
దేవుడు ఆదాము,హవ్వలను ప్రేమించెను. వారుండుటకై ఏడెను అను అందమైన ఒక ఉద్యానవనమును నిర్మించెను. ఆదాము ఈ వన రక్షకుడుగా నుండెను. ఈ ఉద్యానములో వారి తిండికై పలురకముల పండ్లూ, కూరగాయలూ ఉండెను. అందులో మంచి,చెడుతెలివిడిచెట్టు అను ఒక వృక్షముండెను. దేవు డాచెట్టు ఫలములు తిన్నచో మరణము కలుగునని, వానిని తినకూడదని ఆదామునకు చెప్పెను. కాని ఒకనాడు సాతాను వచ్చి హవ్వ కొక అబద్ధమును చెప్పెను. అతడనెను - "మీరు చావనే చావరు ... మీరు మంచిచెడ్డ లెరిగినవారై దేవతలవలె నుందురు" (ఆదికాండము 3:4-5).
ఆమె ఆ అందమైన వృక్షఫలమును చూచి, అది భక్ష్యయోగ్యము విజ్ఞానప్రదమైనదని తలచి, దానిని తాను తీసికొని, ఆదామునకు గూడ ఇచ్చెను. వారిర్వురును ఆ ఫలమును తినిరి. తక్షణమే అపరాధిత్వ భావము వారి హృదయముల నావేశించెను. అట్టి భావము వారిలో ముం దెన్నడునూ లేకుండెను. ఏదో తప్పు చేసినట్లు వారు భావించిరి. దైవాజ్ఞా ధిక్కారమునకు వారు సిగ్గుచెందిరి. దేవుని సమక్షములోనుండుటకు వారు భయపడిరి. అందచే వారు ఆ ఉద్యానవనములోని వృక్షముల మధ్య దాగికొనిరి.
దినమందలి ఒక ప్రశాంతసమయమున "మీరెక్కడ నుంటి" రని దేవుడు వారిని పిలిచెను. వారు దేవునినుండి దాగలేకపోయిరి. అతని సమక్షమునకు వచ్చి తమ తప్పిదమును ఒప్పుకొనిరి. దైవాజ్ఞాధిక్కార మెంత పాపయుక్తమో దేవుడు వారి కెరుకపరచెను. అందుకు వారు శిక్ష ననుభవించవలె ననెను. ఇప్పుడు వారి జీవితములలో బాధను, ప్రయా సను అనుభవింతురనెను. జీవనార్థమై వారింక శ్రమించవలెను; వారి శరీ రములు వృద్ధత్వముతో కృశించును. వారు మరణించి, మరల మట్టి పాలగుదురు.
అట్లు వారా వనమునుండి బహిష్కరింపబడ్డ తర్వాత దేవుడు మండుచున్న కత్తులతో గూడిన దేవదూతలను (కెరూబులను) జీవ వృక్షఫలములు వారి కందకుండ కాపలానుంచెను. వారి కపుడు పాపము, పాపమువల్ల కలిగెడు మహాదుఃఖము తెలిసివచ్చెను.
పాపమువలన కలుగు దుష్టఫలము
ఆదాముహవ్వలు తమ దైవధిక్కారమునకు మిక్కిలి చింతించిరి. ధిక్కరించినను దేవుడు వారిని ప్రేమించెను. మానవుల పాపవిముక్తికై ఒక రక్షకుని పంపెదనని వాగ్దానమును చేసెను.
ఆదాముహవ్వలకు కయీను, హేబెలు అను పుత్రులు కల్గిరి. ఒకనాడు వారిర్వరు దేవునికై అర్పణలను కొనివచ్చిరి. కయీను తాను పండించిన వానిని అర్పణగా తెచ్చెను. హేబెలు తన గొఱ్ఱెలమంద లోని ఒక మంచి గొఱ్ఱెపిల్లను బలిగా నిచ్చి, దాని రక్తమును చిందించెను. హేబెలు సమర్పణ దేవుని కిష్టమయ్యెను గాని కయీను సమర్పణ దేవుని కిష్టము కాలేదు.
ఇది గ్రహించిన కయీనుకు హేబెలుపై ఈర్ష్యాద్వేషములు కల్గెను. తర్వాత వారిర్వురు పొలములో నేకాంతముగా నున్నప్పుడు కయీను హేబెలుపై పడి అతనిని చంపెను. దేవుడు "నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ నున్నాడు?" అని కయీను నడిగెను. కయీను నిజమును దాచి, "నే నెరుగను; నాతమ్మునికి నేను కావలివాడనా?" అనెను (ఆదికాండము 4:9). కయీను దేవుని నిర్దేశములను పాటించకుండెను. హేబెలును చంపక ముందు కయీనున కతడు సత్ప్రవర్తకుడైనచో తానతనిని అంగీ కరింతునని దేవుడు తెల్పియుండెను. కయీను తన వైఖరిని మార్చు కొని, తన తమ్ముని ప్రేమించియుండినచో ఎంత బాగుండెడిది! మఱొక సారి పాపము మానువుని దేవునిసమక్షమునుండి వేరుచేసెను. కయీను తిరుగుబోతుగను , దేశద్రిమ్మరిగను అయిపోయెను.
దేవుడు ఈ ప్రపంచమునెంతో ప్రేమించి దాని రక్షణకై తన కుమారు ని పంపెను
"నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు" (లూకా 2:11).
హేబెలు మరణించి, కయీను ఇంటినుండి వెడలిపోయిన పిదప ఆదాముహవ్వలు షేతు అను మఱొక పుత్రుని కనిరి. షేతు దైవభీతిని కల్గియుండెను. అందుచే దేవు డతని వంశస్థులను దీవించెను. ముక్తి దాత యగు రక్షకు డొకానొకనాడు కలుగునను దేవువి ప్రతినను వారు విని, నమ్మియుండిరి. ముఖ్యముగా అబ్రాము అనునతడు దేవుని విశ్వసించి, దేవుని మిత్రుడుగా పిలువబడెను. తన వంశస్థులద్వారా భూమిపై గల కుటుంబము లన్నియు దీవింపబడునని అబ్రామునకు తెలుపబడెను. కొన్ని వందల యేండ్ల తర్వాత రక్షకుని ఈ ప్రపంచమునకు పంపుదునను వాగ్దానమును దేవుడు పాటించెను. ఇది అత్యాశ్చర్యకర ముగా యూదయ యందలి బెత్లెహాము అను చిన్న ఊరిలో జరిగెను. అందలి పశువులకొట్టములో కన్యకయైన మరియాకు ఒక శిశువు జన్మించెను (లూకా 2:1-7). ఆ శిశువు పేరు యేసు (అనగా రక్షకుడు) అని యుండవలెనని ఒక దేవదూత మరియాకు చెప్పెను. అతడు గొప్ప ఆచార్యుడై దేవునిగూర్చి అనేకవిషయములు ప్రజలకు తెల్పును. యేసు మిగితా పిల్లలవలె సాధారణముగానే పెరిగెను. అతని పన్నెండవయేట యెరూషలేము నందలి వైద్యులకంటెను, న్యాయ వాదులకంటెను అతడు దేవునివాక్యమును బాగుగా నర్థము చేసికొని యుండెను. అతడు ప్రవక్తల న్యాయమును పూర్తిగా నెరిగియుండెను. అతడన్ని ప్రశ్నలకును సమాధానము చెప్పగలిగియుండెను.
యేసు ప్రజల అవసరముల పట్ల గొప్ప ఆసక్తిని కల్గియుండెను. ముప్పది సంవత్సరములవయసులో నతడు యూదుల ప్రార్థనామంది రములలో బోధింపసాగెను. ఒకరోజతడు పాత నిబంధనగ్రంథములో రాబోవు మస్సీహినిగుఱించిన లేఖనమును చదివెను. అది చదివిన వెంటనే అతడనెను - " నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది" (లూకా 4:21). అతడు సాధికారతతో ప్రజలకు బోధనచేసెను. దేవుని సామ్రాజ్యము వచ్చుచున్నది, (పాపములపట్ల) పశ్చాత్తాపమును పొందుట అందులో ప్రవేశించుటకు అవసరమని అతడు బోధించెను. వినయముతో, చిత్తశుద్ధితో దేవుని పూజింపవలెనని అతడు చెప్పెను. గర్విష్ఠులను, విశ్వాసరహితులను అతడు గర్హించెను. ఆపన్నులను, దరిద్రులను ప్రేమింపవలెనను సువార్త నత డందించెను.
యేసు శాశ్వతజీవితమును ప్రసాదించును
యేసు - "పునరుత్థానమును, జీవనమును నేనే. నాయందు విశ్వాస ముంచువాడు చనిపోయినను బ్రతుకును" (యోహాను 11:25) - అని పలికెను.
దేవుడు వాగ్దానము చేసిన రక్షకుడు తానే అని ప్రజలకు నమ్మకము కల్గునట్లుగా యేసు ఎన్నో అద్భుతకార్యములను చేసెను. రోగస్థుల రోగముల నతడు బాగుచేసెను, గ్రుడ్డివారికి చూపు నిచ్చెను, చెవిటి వారికి వినెడు సామర్థ్యము నిచ్చెను, దయ్యముల పాఱద్రోలెను, చచ్చినవారిని బ్రతికించెను. అతడు నీటిపై నడిచెను, సాగరవిజృంభణ మును మాటలచే శాంతిపరచెను. అతడొక అంజూరచెట్టుతో మాట్లాడగా నది మఱునాడు వ్రేళ్లతో సహా ఎండియుండెను. రెండు రొట్టెముక్కలు, చేపలతో అతడు ఐదువేలకంటె ఎక్కువమందికి భోజనము పెట్టెను. వారందఱు తిన్న తర్వాతగూడ 12 బుట్టల నిండ ఇంకను ఆహారము మిగిలియుండెను. అతని ఆదేశమువల్ల బెస్తవారు వలలనిండుగా చేప లను పట్టుకొనిరి. అతని కీర్తిని విన్న పదిమంది కుష్టురోగుల నొకసారి అతడు చూచెను. వారు "స్వామీ మమ్ముల కరుణింపుము" - అని అరచిరి. అతడు కేవలము మాటలతో వారి రోగములనుమాన్పెను.
యేసు ప్రయాణించుచున్నప్పుడును, ఊరిలో నున్నప్పుడును ఎందరో జనులు అతని వెంబడించుచుండిరి. అతని ఉదారవాక్యములు, కృప, భూతదయ, అద్భుతకార్యములచే ప్రజలు అనుగ్రహింపబడిరి. తాను దేవుని పుత్రుడనని అతడు చెప్పసాగెను. అతడు దేవుని పుత్రుడు, అతని తండ్రి దేవుడు. అతని వాక్యములు నమ్మినవారంద రును అనుగ్రహింపబడిరి. అటువంటి వారందరు దేవుని బిడ్డలని అతడు చెప్పెను.
యేసు - "మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలమును సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవు దును" - అని చెప్పెను (యోహాను 14:2,3). క్రైస్తవు లందరికి ఆ స్థలమే పరలోకము.
"నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి, లోకము పుట్టి నది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు కొనుడి" (మత్తయి 25:34)).
యేసు మన పాపములకై మరణించెను
"వారు కల్వరీ అను స్థలమునకు వచ్చినప్పుడు .... అతనిని సిలువ వేసిరి" (లూకా23:33)
యేసు బోధనలపట్ల లేఖకులు, ఫారిసీలు (యూదు మతగురు వులు) అధికమైన కోపమును పొందియుండిరి. అతడు వారి అవనీతికర మైన ధనసంపాదనమును, వారి గౌరవకాంక్షను గర్హించియుండెను. ఎంతోమంది యేసును నమ్ముకొని అతని అనుయాయులై అతనిని ప్రస్తు తించుట వారికి ఈర్ష్యాసూయలను గూర్చెను. వారు యేసును రాజును చేతురని భయపడిరి.
తనయందలి నమ్మకము నశింపజేయు మాటలను, కార్యములను యేసుచేత చేయించుటకు వారు యత్నించిరి. కాని అది ఫలించలేదు. అతని ప్రశస్తి హెచ్చినకొలది వారి కోపద్వేషములు ఎక్కువయ్యెను.అవి ఎక్కువైనకొలది వారు యేసు మరణమునకు కావలసిన పథకములను పన్నిరి.
వారు యేసును న్యాయస్థానమునకు తీసికొనిపోయి అతడు దుర్మార్గుడని, మతదూషకుడని నిందించిరి. వారతనిపై ఎన్నో నేరము లను మోపిరి. ఆపైని యూదయప్రాంతమునకు రోమనుపాలకుడైన పోంటియస్ పిలాతువద్దకు వారతనిని తీసికొనిపోయిరి. పిలాతు అతని యందేమీ అపరాధము లేదని అతనిని విడిచిపెట్టదలచెను. కాని అతనిని నిదించినవారు గుంపుగా నేర్పడి కోపగ్రస్తులై "సిలువ వేయం డతనిని, సిలువ వేయండతనిని" అని అరచిరి. వారి అరపులను, కోపావేశమును చూచిన పిలాతు వారికిలొంగిపోయి యేసును వారి కప్పగించెను. వారు యేసును తీసికొని పోయి అతని తలపై నొక ముండ్లకిరీటమును పెట్టి, ఇదుగో రాజని అతనిని గేలిచేసిరి. అతని ముఖముపై ఉమ్మివేసి, దారుణ ముగా కొట్టిరి. చివరికి అతనిని సిలువపై గట్టి మరణింపజేసిరి.
వందలయేండ్లకు ముందుగా హేబెలు బలి యిచ్చిన గొఱ్ఱెపిల్లవలె యేసు నిర్దోషిగా చంపబడెను.దేవుని గొఱ్ఱెపిల్ల మరణమునకు సూచనగా మున్ను హేబెలు గొఱ్ఱెపిల్లను బలియిచ్చియుండెను. వెనుకటి ప్రవక్తలు గూడ యేసుయొక్క బాధలను, మరణమునుగుఱించి ప్రవచించి యుండిరి. యోహాను బాప్టిస్టు - "ఇదిగో లోకపాపములను మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపపిల్ల" - అని చెప్పెను (యోహాను 1:29). "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని గా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవి తమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను 3:16).
మన విముక్తికై యేసు మరణించినవారినుండి లేచెను
"ఆయన ఇక్కడలేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ఆయన పరుండి ఉండిన స్థలమును చూడండి" (మత్తయి 28:6)
క్రీస్తు మరణించిన తర్వాత అతనిని ఖననము చేసిననాటినుండి మూడవనాటి ప్రాతఃకాలమున కొందఱు స్త్రీలు అతని కాయమునకు లేప నము చేయుటకు వచ్చిరి. కాని ఆశ్చర్యము! ఆ సమాధిలో యేసు కాయము లేకుండెను. అందుచే వారు కలవరపడుచుండిరి. హఠాత్తుగా మెరయుచున్న వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు కనిపించి వారి కిట్లు పల్కిరి - "సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకు చున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి యున్నాడు" (లూకా 24:5,6). ఆ స్త్రీలు వెంటనే తిరిగి వెళ్లి తాము కన్నదీ, విన్నదీ ఇతర శిష్యులకు తెల్పిరి. కాని వారు ఆ కథనము నమ్మలేదు,అందుచే పేతరు, యోహాను దానిని పరిశీలింప నేగిరి. వారుకూడ సమాధి ఖాళీగా నుండుట కన్గొనిరి. వారు వస్త్రములను, చక్కగా మడచిన యేసు తల చుట్టును చుట్టిన బట్టను కన్గొనిరి. వానిని చూచి వారా స్త్రీల కథనమును నమ్మిరి. ఆనాటి సాయంత్రము శిష్యులందఱును యూదులయందలి భయముతోఇంటితలుపు మూసికొని కూర్చుండిరి. అప్పుడు యేసు హఠాత్తుగా వారి మధ్య కనిపించి "మీకు శాంతి కలుగునుగాక!" - అనెను. ములుకులచే గుచ్చబడిన అతని చేతులను, ప్రక్కభాగములను అతడు చూపెను. వారా ప్రభువును చూచి సంతసించి, అతడే సిలువ వేయబడి మృతులనుండి మరల లేచిన వ్యక్తి యని నమ్ముకొనిరి. ఆ తర్వాత యేసు ఎంతో మందికి కనిపించి తన ఉత్థానము సత్యమని చూపెను.
మృతులనుండి యేసు లేచిన దినము ఒక గొప్ప చారిత్రకదినము. ఆరోజు మానవవిముక్తికై దేవునియొక్క అద్భుతమైన పథకము సమాప్త మాయెను. యేసుయొక్క మరణము, ప్రత్యుత్థానములను నమ్మిన వారికి ఈ పథకము మనఃపరివర్తనమును కల్గించును. "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతనసృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" (2 కొరింథీయులకు 5:17). అందుచే హృదయము లందు యేసును అంగీకరించి, జీవితాంతము అతనికి విధేయులైయున్న వారు ప్రత్యుత్థానమును పొంది పరలోకమందు నివసింతురు. "నేను జీవించుచున్నాను గనుకమీరును జీవింతురు" (యోహాను 14:19).
ఈ సందేశము మీహృదయములందు జొచ్చుకొన్నదా? దీనికి మీ ప్రత్యుత్తర మేమిటి? మీరు పశ్చాత్తాపపడి సువార్తను నమ్ముకొందురా? "మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని , ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము" (అపోస్తలులకార్యములు 4:12). ఆల స్యము చేయకు. ఈ నాడే యేసును ఆశ్రయించు.